ప్రశాంత్‌నగర్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..

కూకట్‌పల్లి, ఆంధ్రప్రభ : కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఏబీసీ ప్రింటింగ్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రింటింగ్‌ పరిశ్రమలో భారీగా పెయింట్లు, రసాయనాలు, ద్రవపదార్థాలు, కాగితపు నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.

కొద్దిసేపటికే మంటలు పరిశ్రమ అంతటా విస్తరించడంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్ముకున్నాయి. ప్రమాదాన్ని గమనించిన కార్మికులు, స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పలు అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పరిశ్రమలో ఉన్న పెయింట్లు, రసాయనాల కారణంగా మంటల తీవ్రత అధికంగా ఉండటంతో అప్రమత్తంగా సహాయక చర్యలు చేపట్టారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.

అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో పరిశ్రమలో ఉన్న కార్మికులు బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పినట్లు ప్రాథమిక సమాచారం. అయితే పరిశ్రమలోని ప్రింటింగ్‌ యంత్రాలు, కాగితపు నిల్వలు, పెయింట్లు తదితర సామగ్రి మంటల్లో దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఆస్తి నష్టం ఎంతమేరకు జరిగిందన్నది అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణమా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. అనే కోణంలో కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.