చౌటుప్పల్‌ పరిశ్రమలో ఘోర ప్రమాదం..

  • గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా పేలిన సిలిండర్‌
  • మరో కార్మికుడికి తీవ్ర గాయాలు..
  • హైదరాబాద్‌కు తరలింపు

చౌటుప్పల్‌, ఆంధ్రప్రభ: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని ఆక్సి నౌ మెడికల్‌ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ కంపెనీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో బీహార్‌కు చెందిన వలస కార్మికుడు మనీష్‌ కుమార్‌ (21) మృతి చెందాడు. మరో కార్మికుడు మాథరి హరిప్రసాద్‌ (23) తీవ్రంగా గాయపడగా, మేకల నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. దండుమల్కాపురంలో తాత్కాలికంగా నివాసం ఉంటున్న మనీష్‌ కుమార్‌ ఆ కంపెనీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో అతడు గ్యాస్‌ సిలిండర్‌లో ఫిల్లింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా అది పేలింది. పేలుడు ధాటికి మనీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి శరీర భాగాలు ఛిన్నాభిన్నమైనట్లు సమాచారం. పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన హరిప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కాలు మోకాలి వరకు విరిగిపోయినట్లు తెలిసింది. సమీపంలో ఉన్న నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

పరిశ్రమలో 12 మంది కార్మికులు

ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో మొత్తం 12 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఏడుగురు బయట ఉండగా.. ఇద్దరు మహిళలు, ముగ్గురు కార్మికులు షెడ్డులో ఉన్నారు. సిలిండర్‌ పేలుడు శబ్దంతో స్థానికులు, తోటి కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

సమాచారం అందుకున్న చౌటుప్పల్‌ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, చౌటుప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి. మన్మధకుమార్‌, రూరల్‌ సీఐ దేవిరెడ్డి సతీష్‌రెడ్డి, స్థానిక ఎస్సై యాదగిరి, పోచంపల్లి ఎస్సై జగన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన హరిప్రసాద్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మనీష్‌ కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చౌటుప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ మన్మధకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మనీష్‌ కుమార్‌ (21)
మాథరి హరిప్రసాద్‌ (23)