Maharashtra Girlfriend Murder Case | పెళ్లి నిశ్చయం.. ప్రేమకు నిరాకరణ.. చివరకు లోయలోకి నెట్టి హత్య!

మహారాష్ట్రలో దారుణ ఘటన
పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
యువతి అదృశ్యమైనట్లు నాటకం..
విచారణలో వెలుగులోకి ఘటన

కొల్హాపూర్‌, ఆంధ్రప్రభ: పెళ్లి నిశ్చయమైన తర్వాత తనకు బ్రేకప్‌ చెప్పిందన్న కారణంతో ఓ యువతిని ఆమె ప్రేమించిన యువకుడే లోతైన లోయలోకి నెట్టి హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తొలుత యువతి కనిపించడం లేదంటూ చెప్పిన నిందితుడు.. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కానీ పోలీసుల విచారణలో యువకుడి చెప్పిన విషయాలకు ఖంగుతిన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. గార్గోటిలోని అవధూత్‌ కాలనీకి చెందిన శ్రీపాద్‌ దింకర్‌ వాడు (25), తరణ్ణుమ్‌ బషీర్‌ నాయక్‌ (23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఒకరి ఎదురెదురు ఇంట్లోనే ఉండే వారు. తరణ్ణుమ్‌ మహగావ్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. అయితే, ఇటీవల ఆమెకు వేరే యువకుడితో వివాహం నిశ్చయమైంది. దీంతో ఇకపై తనను మర్చిపోవాలని.. తనతో ప్రేమను కొనసాగించలేనని శ్రీపాద్‌ దింకర్‌ వాడు చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య విభేదాలు కూడా తలెత్తినట్లు పోలీసులు తెలిపారు.

శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో శ్రీపాద్‌.. తరణ్ణుమ్‌కు ఫోన్‌ చేసి నాయక్‌వాడి సమీపంలోని లోయ వద్దకు రావాలని కోరాడు. అక్కడ మాట్లాడుకుంటున్న సమయంలో తనకు వివాహం నిశ్చయమైందని, తనతో సంబంధాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ఆమె మరోసారి తేల్చి చెప్పింది. దీంతో శ్రీపాద్‌ కోపంతో ఆమెను లోతైన లోయలోకి నెట్టివేసినట్లు పోలీసులకు వెల్లడించారు. కాగా ఈ ఘటనలో యువతి మృతి చెందింది.

ఘటన అనంతరం తరణ్ణుమ్‌ కనిపించడం లేదంటూ శ్రీపాద్‌ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం భుదర్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలపై విచారించారు. తరణ్ణుమ్‌ మృతి గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు గార్గోటిలోని జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో బంధువులు అక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై భుదర్‌గఢ్‌ పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.