cji| ఇండియా కూటమిపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ విమర్శలు

ఇండియా కూటమిపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ విమర్శలు

  • సమస్య ఉంటే న్యాయస్థానంలోనే తేల్చుకోవాలి
  • సీజేఐ నిర్ణయాన్ని తప్పుబట్టడంపై అభ్యంతరం
  • న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నమని వ్యాఖ్య

ముంబై, ఆంధ్రప్రభ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ తనను కలవాలన్న ఇండియా కూటమి నేతల విజ్ఞప్తిని తిరస్కరించడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. నిరసన ర్యాలీని సీజేఐ కలవాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, చట్టపరంగా పోరాడాలని సూచించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు వెల్లడించిన అభిప్రాయం సరైనదేనని పేర్కొన్నారు.

రాజ్యాంగంపై విశ్వాసం లేదంటూ విమర్శలు

ప్రతిపక్షాలు మరోసారి రాజ్యాంగంపై తమకు విశ్వాసం లేదని నిరూపించుకున్నాయని ఫడ్నవీస్‌ విమర్శించారు. సీజేఐ తన రాజ్యాంగబద్ధ విధులను చట్టప్రకారం నిర్వర్తిస్తూ, నిరసన ర్యాలీని కలవలేనని చెప్పినప్పుడు ఆయనపై విమర్శలు, దూషణలకు దిగడం సరికాదన్నారు. సమస్యలను న్యాయపరంగా పరిష్కరించుకోవాల్సింది పోయి, సీజేఐ నిర్ణయాన్ని తప్పుబట్టడం ఏమిటని ప్రశ్నించారు.

న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీసే కుట్ర?

భారత న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసి, దానిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఫడ్నవీస్‌ ఆరోపించారు. న్యాయస్థానాల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ప్రతి పౌరుడికీ ఉందని, నిరసనల ద్వారా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడం తగదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.