Maharashtra Baby Sale | బిడ్డను అమ్మేసింది.. బంగారం కొనేసింది.. పోలీసు ఆరాతో వెలుగు చూసింది!
- రూ.1.20 లక్షలకు నెల రోజుల బిడ్డ అమ్మకం
- నాలుగుసార్లు చేతులు మారిన శిశువు
- హైదరాబాద్‌లో గుర్తించిన పోలీసులు
ముంబయి, ఆంధ్రప్రభ: విలాసవంతమైన జీవితం, ఖరీదైన మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాల కోసం కన్నబిడ్డనే విక్రయించిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. ఛత్రపతి సంభాజీనగర్‌కు చెందిన ఓ దంపతులు తమ నెల రోజుల పసికందును రూ.1.20 లక్షలకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ శిశువు అనంతరం పలువురి చేతులు మారుతూ 550 కిలోమీటర్లకు పైగా దూరంలోని హైదరాబాద్‌కు చేరింది. చివరకు పోలీసులు అక్కడి నుంచి చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్రపతి సంభాజీనగర్‌లోని ముకుంద్‌వాడి ప్రాంతంలో లివ్‌ఇన్ రిలేషన్‌లో ఉంటున్న దంపతులకు జూలైలో మగ శిశువు జన్మించాడు. ఆ తర్వాత తమ ఖర్చులు, విలాసవంతమైన జీవనశైలి కోసం బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. మధ్యవర్తిగా వ్యవహరించిన సీమా రేశ్వాల్‌కు రూ.1.20 లక్షలకు శిశువును అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
చేతులు మారుతూ.. ధర పెరుగుతూ
శిశువును తీసుకున్న సీమా రేశ్వాల్ మరో మహిళ సుజాత అవ్హాడ్‌కు రూ.2.70 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె ఆ చిన్నారిని సురేశ్ గుంటుకా అనే వ్యక్తికి రూ.3.50 లక్షలకు విక్రయించినట్లు వెల్లడైంది. గుంటుకా తన హైదరాబాద్‌లోని బంధువు ఉమా ఖట్కమ్‌కు శిశువును అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బిడ్డ నాలుగుసార్లు చేతులు మారినట్లు దర్యాప్తులో తేలింది. బిడ్డను విక్రయించిన తర్వాత వచ్చిన డబ్బుతో దంపతులు రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి..
డబ్బుల విషయంలో జంట మధ్య గొడవ జరగడంతో సెప్టెంబర్ 20న తల్లి తనపై దాడి జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఆమె నెల రోజుల కుమారుడిని విక్రయించిన విషయం పోలీసులకు తెలిసింది. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు శిశువు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్‌లో సురక్షితంగా రక్షణ
శిశువు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారిని సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం బిడ్డను మహారాష్ట్రకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తులు, బిడ్డను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కలిపి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో పాల్గొన్న మధ్యవర్తులు గతంలోనూ ఇలాంటి బాలల విక్రయాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరిన్ని వివరాలను వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోంది.
