లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీవైఎస్ఓ

కేటరింగ్ బిల్లుల చెల్లింపుల కోసం లంచం డిమాండ్‌..
జిల్లా యువజన, క్రీడల అధికారి, కంప్యూటర్ ఆపరేటర్ అరెస్ట్

మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ : కేటరింగ్ బిల్లులను ప్రాసెస్ చేసి, చెక్కులు జారీ చేసేందుకు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ జిల్లా యువజన, క్రీడల అధికారి, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బిల్లుల చెల్లింపులకు లంచం డిమాండ్‌

మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి జె. రాజశేఖర్ రెడ్డి (ఏ-1), కంప్యూటర్ ఆపరేటర్ జి. ఉమేష్ (ఏ-2) బాధితుడికి సంబంధించిన కేటరింగ్ పనుల బిల్లులను ప్రాసెస్ చేసి, చెక్కులు జారీ చేసేందుకు రూ.1,00,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఇద్దరు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.

అవినీతి నిరోధక చట్టం కింద కేసు

నిందితులిద్దరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.