హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడి (Khairatabad Maha Ganesha Temple) నిమజ్జనం పూర్తైంది. నాలుగు గంటల శోభాయాత్ర అనంతరం లక్షలాది మంది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ చేసిన జయజయధ్వానాల నడుమ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. దాదాపు 70 అడుగుల భారీ క్రేన్ (Crane) సాయంతో హుస్సేన్ సాగర్ (Hussain Sagar)లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది.
శనివారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి కదిలిన గణనాథుడి శోభాయాత్ర, మధ్యాహ్నం 12 గంటల సమయానికి ట్యాంక్‌బండ్(Tank Bund)కు చేరుకుంది. ఈ యాత్ర కోసం విజయవాడ (Vijayawada) నుంచి ప్రత్యేకంగా తెప్పించిన భారీ వాహనాన్ని వినియోగించారు. దారి పొడవునా చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి నీరాజనాలు పలికారు. మహాగణపతిని కడసారి చూసేందుకు జనం పోటెత్తడంతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ ( NTR Marg) పరిసరాలు పూర్తిగా కిక్కిరిసిపోయాయి.

