Made in India Bullet Train |భారత్‌ తొలి స్వదేశీ బుల్లెట్‌ రైలు.. గంటకు 280 కి.మీ. వేగం!

  • 557 మంది ప్రయాణించేలా రూపకల్పన
  • అత్యాధునిక సాంకేతికతతో బెంగళూరులో తయారీ
  • వైఫై, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ప్రత్యేక సీటింగ్‌
  • దివ్యాంగులకూ అనుకూలంగా డిజైన్‌

ఆంధ్రప్రభ, బెంగళూరు: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. విదేశాల మీద ఆధారపడకుండా, పూర్తి మన దేశపు సాంకేతికతతో తొలి బుల్లెట్ రైలును తయారు చేసే పనిలో పడ్డారు. బెంగళూరులోని బీఈఎంఎల్ కేంద్రంలో ఈ రైలు తయారీ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ పనులను పరిశీలించి, దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు మార్గం కోసం ఈ అద్భుతమైన రైలును సిద్ధం చేస్తున్నారు.

గంటకు 280 కిలోమీటర్ల వేగం..

మన దేశం తయారు చేస్తున్న ఈ బుల్లెట్ రైలు గంటకు ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. సాధారణ సమయాల్లో దీన్ని గంటకు 249 కి.మీ. వేగంతో నడిపేలా ప్లాన్ చేశారు. సుమారు 202 మీటర్ల పొడవుండే ఈ రైలులో మొత్తం 8 కోచ్‌లు ఉంటాయి. ఒకేసారి 557 మంది ప్రయాణించవచ్చు. సీటింగ్ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రెండు స్థలాలను కేటాయించారు. అవసరమైతే ఇలాంటి రెండు రైళ్లను కలిపి, 16 కోచ్‌లతో కూడా నడపవచ్చు.

ప్రయాణంలో సరికొత్త అనుభూతి..

రైలు లోపల విశాలమైన కిటికీలు, ఎక్కువ లెగ్‌రూమ్, ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు ఛార్జ్ చేసుకోవడానికి పాయింట్లు, పెద్ద లగేజీ పెట్టుకోవడానికి ప్రత్యేక స్థలం ఇస్తారు. కోచ్‌ల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా ఒక దాని నుండి మరొకదానిలోకి వెళ్లవచ్చు. ప్రయాణ వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ఇంగ్లీష్, హిందీతో పాటు మన ప్రాంతీయ భాషల్లో కూడా స్క్రీన్లపై సమాచారం కనిపిస్తుంది. వైఫై సదుపాయం ఉండటంతో ప్రయాణంలో వినోదాన్ని ఆస్వాదించవచ్చు.

దివ్యాంగులకు పెద్దపీట

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్లాట్‌ఫామ్‌ ఎత్తుకు సమానంగా రైలు ఫ్లోర్ ఉండేలా డిజైన్ చేశారు. వీల్‌చైర్ వాడేవారికి ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, టాయిలెట్లు ఉంటాయి. అలాగే చూపు లేనివారి కోసం బ్రెయిలీ లిపితో కూడిన సూచికలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బయట వాతావరణం ఎలా ఉన్నా.. రైలు లోపల మాత్రం ఎప్పుడూ ఒకేలాంటి ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రత ఉండేలా ఏసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

శబ్దం రాకుండా.. విద్యుత్ ఆదా అయ్యేలా

అత్యధిక వేగంతో వెళ్లేటప్పుడు గాలి వల్ల వచ్చే శబ్దం, అడ్డంకులు తగ్గడానికి ఈ రైలును చాలా ప్రత్యేకంగా (ఏరోడైనమిక్ డిజైన్) రూపకల్పన చేశారు. సొరంగాల్లో వెళ్లేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక శబ్ద నిరోధక కవర్లను వాడుతున్నారు. అంతేకాదు, బ్రేక్ వేసేటప్పుడు ఖర్చయ్యే శక్తిని మళ్లీ విద్యుత్‌గా మార్చే ‘రీజనరేటివ్ బ్రేకింగ్’ సిస్టమ్‌ను ఇందులో వాడటం మరో విశేషం.

బ్రేకింగ్‌లోనూ ఆధునిక సాంకేతికత

ఈ బుల్లెట్‌ రైలు 25 కేవీ, 50 హెర్ట్జ్‌ సింగిల్‌ ఫేజ్‌ ఏసీ విద్యుత్‌ వ్యవస్థతో పనిచేస్తుంది. ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్ల ద్వారా దీనికి శక్తి అందుతుంది. ఇందులో రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థను కూడా ఉపయోగించనున్నారు. సాధారణంగా రైలు వేగాన్ని తగ్గించే సమయంలో ఉత్పత్తయ్యే కొంత శక్తిని ఈ సాంకేతికత తిరిగి విద్యుత్‌గా మార్చి వ్యవస్థలోకి పంపుతుంది. తద్వారా విద్యుత్‌ వినియోగ సామర్థ్యం మెరుగుపడుతుంది.

స్వదేశీ హైస్పీడ్‌ ప్రయాణానికి కొత్త దిశ

బెంగళూరులోని బీఈఎంఎల్‌ కేంద్రంలో నిర్మాణం, పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయంగా హైస్పీడ్‌ రైలు తయారీ సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా భారత్‌ ముందడుగు వేస్తోంది. వేగం ఒక్కటే కాకుండా భద్రత, ప్రయాణికుల సౌకర్యం, అందుబాటు, విద్యుత్‌ ఆదా వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ రైలు ప్రత్యేకత. ముంబై-అహ్మదాబాద్‌ కారిడార్‌ కోసం రూపొందిస్తున్న ఈ రైలు అందుబాటులోకి వస్తే భారత రైల్వే రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ప్రాధాన్యం లభించనుంది. త్వరలోనే మన దేశంలోనే తయారైన బుల్లెట్ రైలు పట్టాలెక్కి ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.