Madaram | అక్కడ అడవులే రాజ్యం…

Madaram | అక్కడ అడవులే రాజ్యం…
Madaram | తాడ్వాయి( మేడారం) ఆంధ్రప్రభ : ప్రతి రెండు సంవత్సరాలకు మాఘమాసం రాగానే ములుగు జిల్లా తాడ్వాయి మండలం రూపమే మారిపోతుంది. నిత్యం నిశ్శబ్దంగా ఉండే దట్టమైన అడవులు, కొండల మధ్య ఉన్న మేడారం ప్రాంతం ఒక్కసారిగా జనసముద్రంగా మారుతుంది. పట్టణం కాదు, పెద్ద గ్రామం కాదు… సాధారణ రోజుల్లో అక్కడ అడవులే రాజ్యం. కానీ జాతర వేళ ఆ అరణ్యంలోనే ఒక మహానగరం ఆవిర్భవిస్తుంది. నాలుగు రోజుల పాటు జరిగే శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతరకు దేశం నలుమూలల నుంచి కోట్లాది భక్తులు తరలివస్తారు. “తెలంగాణ కుంభమేళా”గా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ మహాజాతర, విశ్వాసానికి ఉన్న శక్తిని ప్రతి సారి రుజువు చేస్తుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లా కేంద్రం నుంచి సుమారు 44 కిలోమీటర్ల దూరంలో, తాడ్వాయి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న మేడారం గ్రామం దట్టమైన అడవులు, కొండల మధ్య సమ్మక్క–సారలమ్మ తల్లులు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం. గుడి లేదు… గోపురం లేదు… అయినా అమ్మల రాక కోసం లక్షల కాదు, కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు అంటే, అది వారి త్యాగానికి, ధైర్యానికి, గిరిజనుల ఆత్మగౌరవానికి అద్దం పడుతున్న విశ్వాసమే.

భక్తుల విశ్వాసాన్ని కాపాడుకుంటూ, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేడారం మహాజాతర–2026ను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేసింది. రహదారులు, క్యూ లైన్లు, పార్కింగ్, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్, రవాణా, భద్రత వంటి అన్ని విభాగాల్లో ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టి, జాతరను వైభవంగా నిర్వహిస్తోంది. కోట్లాది భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేలా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది.

వనదేవతలుగా పూజించబడే సమ్మక్క–సారలమ్మలు కేవలం ఆరాధ్యదైవాలు మాత్రమే కాదు… అన్యాయానికి ఎదిరించిన పోరాటానికి ప్రతీకలు. అందుకే మేడారం జాతర ఒక పండుగ మాత్రమే కాదు తరతరాలుగా కొనసాగుతున్న జీవ విశ్వాసం.
