శ్రీ సత్యసాయి బ్యూరో ఏప్రిల్ 13 (ఆంధ్రప్రభ)అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని పుంగనూరు సుగాలి మిట్ట వద్ద కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో కదిరికి చెందిన ఉపాధ్యాయ కుటుంబం సభ్యుల్లో ఒకరు మృతిచెందగా ఇరువురు తీవ్రంగా గాయపడి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇంజనీరింగ్ విద్యార్థిని కీర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులకు అందిన సమాచారం మేరకు కదిరి పట్టణానికి చెందిన శారద అనే ఉపాధ్యాయురాలు కదిరి పట్టణ సమీపంలోని బాలప్ప గారి పల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఈమే సంఘటన స్థలంలో మృతిచెందగా ఆమె భర్త వెంకటరమణ అన్నమయ్య జిల్లా మొలకలచెరువు సమీపంలోని సోంపాల్యం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తారు. వీరి కుమార్తె కీర్తి బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతోంది. వీరికి మరో కుమారుడు ఉన్నాడు.

ఇటీవలనే వీరు నూతనంగా కారు కొనుగోలు చేసి, అదే కారులో సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ పున్నమి ని పురస్కరించుకొని, అరుణాచలం వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకుని, అనంతరం తిరుగు ప్రయాణంలో కదిరికి వస్తుండగా మదనపల్లి సమీపంలోని సుగాలిమిట్ట వద్ద వేగంగాదూసుక వచ్చిన లారీ వీరి కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.