మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా కాంకర్ లాజిస్టిక్స్‌ హబ్‌

ప్రాజెక్టు ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం: కాంకర్‌ సీఎండీ

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : లోక్‌సభ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజిత్‌ కుమార్‌ పాండాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ డీప్‌ వాటర్‌ పోర్టుకు అనుబంధంగా ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటు అంశాన్ని ఎంపీ ప్రస్తావించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కాంకర్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం మచిలీపట్నంలో లాజిస్టిక్స్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, గత ఒప్పందం ప్రకారం కాంకర్‌ తన కార్యకలాపాలను పోర్టు ప్రాంతంలో ప్రారంభించేందుకు ముందుకు రావాలని సీఎండీని కోరారు. దీనిపై కాంకర్‌ సీఎండీ అజిత్‌ కుమార్‌ పాండా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టును సందర్శించి, ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టి పనుల ప్రారంభానికి కృషి చేస్తామని ఎంపీకి తెలియజేశారు.

మచిలీపట్నం పోర్టు అభివృద్ధితో పాటు దానికి అనుబంధంగా లాజిస్టిక్స్‌, గిడ్డంగులు, రవాణా, తయారీ రంగ పరిశ్రమలను తీసుకురావడంపై వల్లభనేని బాలశౌరి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోర్టు ద్వారా సముద్ర వాణిజ్య అవకాశాలు పెరగడంతో పాటు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించాలన్న లక్ష్యంతో సంబంధిత సంస్థలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.

ఇటీవల మచిలీపట్నం ప్రాంతంలో గోవా షిప్‌యార్డ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ముందుకు సాగుతున్న నేపథ్యంలో, కాంకర్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ కూడా కార్యరూపం దాలిస్తే పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది. సరుకు రవాణా, నిల్వ, పంపిణీ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ ప్రాజెక్టు దోహదపడే అవకాశం ఉంది.

మచిలీపట్నం పోర్టును కేవలం సరుకు రవాణా కేంద్రంగా మాత్రమే కాకుండా, అనుబంధ పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వల్లభనేని బాలశౌరి చేస్తున్న ప్రయత్నాల్లో కాంకర్‌తో జరిగిన తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు తదుపరి దశలు ప్రభుత్వ అనుమతులు, సంస్థాగత నిర్ణయాలు, కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా ముందుకు సాగనున్నాయి.