ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రతీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. కృష్ణా జిల్లా కోడూరు మండలం, పాలకాయత్తిప్ప సముద్రతీరంలో 7–8 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి.
పర్యాటకులు సముద్రానికి చేరకుండా స్థానిక పోలీసులు వారిని వెనక్కి పంపుతూ అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని.. వేట బోట్లు, వలలను సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలని మత్స్యశాఖ అధికారులు సూచించారు. కోడూరు మండల ఇన్‌ఛార్జి తాహసీల్దార్ సౌజన్య కిరణ్మయి కూడా ఈ విషయంలో కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
తీవ్ర వర్షాల హెచ్చరిక..
అమరావతి వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం, బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు కురిసే అవకాశం ఉంది. డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.