Stock Market | దేశీయ మార్కెట్లకు నష్టాలు…
ముడిచమురు ధరల పెరుగుదల..
బ్యాంక్, ఆటో షేర్లలో అమ్మకాలు
Stock Market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ముడిచమురు ధరల పెరుగుదలతో పాటు బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపింది. ఉదయం ట్రేడింగ్‌లో కొంతకాలం లాభాల్లో కొనసాగిన సూచీలు చివరికి నష్టాల్లో స్థిరపడ్డాయి.
క్రితం సెషన్‌లో 76,957 వద్ద ముగిసిన సెన్సెక్స్.. మంగళవారం 76,994 వద్ద ప్రారంభమైంది. తొలుత సూచీ లాభాల్లో కదలాడుతూ ఒక దశలో 77,231 పాయింట్ల వరకు ఎగబాకింది. అయితే అనంతరం అమ్మకాల ఒత్తిడి పెరగడంతో లాభాలు ఆవిరయ్యాయి. చివరకు 12 పాయింట్ల నష్టంతో 76,944.28 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది.
నిఫ్టీ కూడా స్వల్ప నష్టాలతో ముగిసింది. రోజంతా ఒడిదుడుకులకు లోనైన సూచీ చివరకు 24,055 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల కదలికలు, దేశీయంగా బ్యాంకింగ్, ఆటో రంగాల్లో అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 27 పైసలు బలపడి 94.95 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీలో ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ షేర్లు రాణించాయి. దీంతో మార్కెట్ నష్టాలు కొంతమేర పరిమితమయ్యాయి. అయితే శ్రీరామ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, నెస్లే, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో రంగాలపై అమ్మకాల ప్రభావం కనిపించడంతో మార్కెట్లు లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి.
