ఆధ్యాత్మిక శోభతో ఆంధ్రప్రభలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…
- వేద మంత్రోచ్ఛారణల మధ్య విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు..
- తొలిపూజ నిర్వహించిన ఎండీ ముత్తా గౌతం దంపతులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ ప్రత్యేక ప్రతినిధి : విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆదిదేవుడు శ్రీ గణేశుడి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ ప్రధాన కార్యాలయంలో సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. గణనాథుడి ఆగమనంతో కార్యాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
సాయంత్రం నిర్వహించిన తొలి పూజా కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతం, సునీత దంపతులు పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు.
సకల విఘ్నాలను తొలగించి సుఖసంతోషాలు, ఐశ్వర్యం, విజయాలను ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు. భక్తిభావంతో నిర్వహించిన పూజా కార్యక్రమంతో కార్యాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రభ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పసునూరి భాస్కర్, తెలంగాణ జీఎం పసునూరి రమేష్, మార్కెటింగ్ జీఎం గంజి వెంకటేశ్వరరావు (వీటీ), క్వాలిటీ సెల్ ఇన్‌చార్జి చిట్టిబాబు, వెబ్ డీజీఎం సాయికుమార్, వెబ్ ఎడిటోరియల్ ఇన్‌చార్జి బహుదూర్, ఐటీ ఇన్‌చార్జి శ్రీనివాస్ (శీనయ్య), యూట్యూబ్ ఇన్‌చార్జి రాఘవ చైతన్యతో పాటు ఆంధ్రప్రభ పత్రిక, వెబ్, యూట్యూబ్, స్మార్ట్ ఎడిషన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొని గణనాథుడికి పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ఆంధ్రప్రభ కుటుంబ సభ్యులందరికీ భక్తి, ఐక్యత, ఆనందాన్ని పంచాలని ఆకాంక్షించారు. అనంతరం ఆంధ్రప్రభ యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని స్వీకరించారు.
