LOC |పాక్‌ కవ్వింపు .. సరిహద్దుల్లో భారత్‌ సైన్యంపైకి కాల్పులు

న్యూ ఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్‌ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్‌ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తోంది.అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బందిపొరాలో ఎన్‌కౌంటర్‌

మరోవైపు, జమ్మూకశ్మీర్‌లోని బందిపొరాలో శుక్రవారం ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. ఈ జిల్లాలోని కుల్నార్‌ బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

కశ్మీర్‌కు ఆర్మీ చీఫ్‌

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. శ్రీనగర్‌, ఉదమ్‌పూర్‌లో పర్యటించనున్నారు. కశ్మీర్‌ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ, పహల్గాం దాడి నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.పహల్గాంలో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భారత్‌, పాక్‌ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్‌ పౌరులు తక్షణమే భారత్‌ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *