మద్యం తయారీ నుంచి వినియోగదారుడి వరకు..

ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానం

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లాలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌. శ్రీనివాసరావు తెలిపారు. నూతన పాలసీలో భాగంగా ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం తయారీ నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి దశను ఈ విధానం ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా బెల్ట్‌ షాపులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఏ దుకాణం నుంచి మద్యం బెల్ట్‌ షాపులకు చేరిందో గుర్తించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే చర్యలు చేపడుతున్నామని శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణా జిల్లాలో మొత్తం 135 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటివరకు 100 దుకాణాల పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. మిగిలిన 35 దుకాణాలకు అక్టోబర్‌ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. అక్టోబర్‌ 3న పరిశీలన ప్రక్రియ, 5న లాటరీ విధానంలో మద్యం దుకాణాల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.