కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌ డెస్క్‌: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేను న్యాయస్థానం ఎత్తివేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే ఈ రెండు పథకాలు ఎంతో కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అర్హులైన కుటుంబాలకు ఈ పథకాల ద్వారా అందే ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్టే కారణంగా పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేసి ఆర్థిక సాయం అందించాలని అధికారులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. కోర్టు విధించిన స్టేను కొందరు రాజకీయ కోణంలో చూస్తూ పథకాలు రద్దు అయినట్లుగా ప్రచారం చేయడం సరికాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగే అంశాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రతి రాజకీయ పార్టీ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని మరోసారి అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు.