లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 99 పోస్టులు ఖాళీ
గ్రంథాలయాల్లో సిబ్బంది లేక పాఠకులు, నిరుద్యోగులకు ఇబ్బందులు
సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసిన బట్టు సాంబయ్య

నల్లబెల్లి, ఆంధ్రప్రభ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్న 99 లైబ్రేరియన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి, సామాజిక ఉద్యమ నేత బట్టు సాంబయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు నల్లబెల్లి మండల కేంద్రంలోని సబ్‌ పోస్టాఫీస్‌ ద్వారా రిజిస్టర్‌ పోస్టులో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞాపన పత్రం పంపించారు.

ఈ సందర్భంగా బట్టు సాంబయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉండటంతో పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని పాఠకులకు అందించేందుకు సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందన్నారు.

ఉన్నత విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతీ యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో వేలాది రూపాయలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ కేటగిరీలకు చెందిన నిరుద్యోగులకు ప్రభుత్వ గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.

బీఎల్‌ఐసీ, ఎంఎల్‌ఐసీ కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది నిరుద్యోగులు లైబ్రేరియన్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ద్వారా నియామకాలు చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్‌ ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొండాయిలపల్లి ఉపసర్పంచ్‌ పెంతల నాగరాజు, ఎలబోయిన శ్రీను, స్థానిక ఎస్‌పీఎం అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.