ఐదు ఎకరాల కుంటకు విముక్తి..

  • జేసీబీతో ఆక్రమణల తొలగింపు
  • ఎవరు ప్రవేశించకూడదని బోర్డు

చిత్తూరు , ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దాసరా పల్లెలో కబ్జాకు గురైన మల్లిరెడ్డి కుంటను శుక్రవారం గట్టి పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. జేసీబీతో కుంటలోనే ఆక్రమణలను తొలగించారు. కుంటలోకి ఎవరు ప్రవేశించకూడదని తాహసీల్దార్ బోర్డు పెట్టారు.

చార్వకాని పల్లె రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 4/2 లో ఐదు ఎకరాల విస్తీర్ణంలోని ఈ కుంటను తహసీల్దారు శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో స్వాధీనం చేసుకుని బోర్డు పెట్టారు. అన్న దమ్ములు కె కృష్ణా రెడ్డి, కె చిన్నస్వామి రెడ్డి ఈ కుంటలో కొంత భాగాన్ని ఆక్రమించుకుని జామ చెట్లు పెట్టారు.

దీనిపై కొందరు రైతులు అధికారులకు అభ్యంతరాలు తెలపడంతో అన్నదమ్ములు ఈ కుంట భూమి తమ తాత మల్లిరెడ్డి దని, దీనిపై ఇంజక్షన్ ఇవ్వాలని 2017 లో చిత్తూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టులో సూట్ నెంబర్ 297/ 2017 దాఖలు చేశారు. చుట్టూ ఉన్న భూమితో పాటు కుంట భూమి కూడ తమ దేనని వాదించారు. తమ అన్న శివశంకర్ రెడ్డి పేరుతో రెవెన్యూ రికార్డులు ఉన్నాయని తెలిపారు.

విచారణ చేసిన అనంతరం దీనిపై కృష్ణా రెడ్డి, చిన్నస్వామి రెడ్డికి ఎలాంటి హక్కు లేదని జడ్జి డి ఉమాదేవి ఈ ఏడాది జులై 3 న తీర్పు చెప్పారు. కోర్టు తీర్పు ఆధారంగా అధికారులు కుంట సరిహద్దులను ఏర్పాటు చేసారు. జేసీబీ ద్వారా చుట్టూ కాలువ తవ్వి గట్టు వేశారు. వీరితో పాటు ఇతరులు కబ్జా చేసిన మరి కొంత భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంట ప్రభుత్వానికి చెందినదని ఎవరికి హక్కు లేదని, అక్రమంగా ప్రవేశిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దారు పేరుతో బోర్డు పెట్టారు.

ఇదిలా ఉండగా ఆక్రమణ దారుల కుటుంబ సభ్యులు అడుగడుగున అధికారులకు అడ్డు పడినట్టు గ్రామస్తులు చెప్పారు. తమకు ఇదొక్కటే జీవనాధారం అని, ఇది కూడా పోతే తమకు ఆత్మ హత్యే శరణ్యం అంటూ రాద్దాంతం చేశారని సమాచారం.

అయితే అధికారులు పోలీసుల రక్షణ మధ్య స్వాధీనం చేసుకుని బోర్డు పెట్టారు. ఇదిలా ఉండగా ఇరిగేషన్ శాఖ ఈ కుంటను అభివృద్ధి చేయాలని ఆయకట్టు దారులు కోరుతున్నారు. గతంలో ఇలాగే రెండు ఎకరాల పెద్దమ్మ కుంటను అధికారులు ఖాళీ చేశారని తెలిపారు. అయితే ఆ కుంటను తిరిగి చిన్నస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించు కొన్నారని గ్రామస్థులు చెప్పారు.

Leave a Reply