విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలి!
బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గంగిడి మనోహర్‌రెడ్డి డిమాండ్
త్యాగధనుల పోరాట ఫలితాన్ని స్మరించుకోవాలని పిలుపు
సెప్టెంబర్ 17న ప్రతి వీధిలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని విజ్ఞప్తి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చౌటుప్పల్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించగా.. నిజాం పాలన నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించిందని ఆయన పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో తెలంగాణకు విముక్తి లభించిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మాట తప్పాయని ఆయన విమర్శించారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా లభించిన విముక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలంతా తమ వీధుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించాలని గంగిడి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన-ఐలయ్య యాదవ్, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు కైరంకొండ అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడల భిక్షంగౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుడ్డ సురేష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్‌బాబు, సర్పంచులు తంగేళ్ల వెంకటేశం, నందగిరి వెంకటేశం, మున్సిపల్ కౌన్సిలర్ పోలపల్లి లక్ష్మి-ముత్తయ్య, సీనియర్ నాయకులు రమణగొని శంకర్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చినుకుని మల్లేశం, సీనియర్ నాయకులు ముత్యాల భూపాల్‌రెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి, భవనం మధుసూదన్‌రెడ్డి, రిక్కల సుధాకర్‌రెడ్డి, బత్తుల జంగయ్యగౌడ్, కట్ట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
