KNL | అందరి భాగస్వామ్యంతో జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దుదాం : కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు బ్యూరో : అందరి భాగస్వామ్యంతో మన జిల్లాను శుభ్రమైన జిల్లా గా తయారు చేసుకుందాం అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం గోనెగండ్ల మండల కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా తొలుత గోనెగండ్ల మండల కేంద్రం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఎంపిడిఓ కార్యాలయం వరకు నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీ లో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీ పేట ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అధికారులతో కలిసి చెత్తను ఊడ్చి కలెక్టర్ శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి నెల ఒక్కొక్క థీమ్ తో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. తడి చెత్త, పొడి చెత్త లను వేరు చేయడం పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చెత్తను బయట పడేయకుండా ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తలను వేరు చేసి సంబంధిత డస్ట్బిన్ లలో వేసి పారిశుధ్య కార్మికులు ఇంటింటికి వచ్చినపుడు అందజేయాలని కలెక్టర్ ప్రజలను కోరారు.

తడి, పొడి చెత్తలను వేరు చేస్తేనే ప్రాసెసింగ్ చేయొచ్చన్నారు. సేకరించిన చెత్తను చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో కంపోస్టు, వర్మీ కంపోస్ట్ ఎరువులను తయారు చేసి వాటిని అమ్మి సంపద సృష్టిస్తారన్నారు.. ఈ విధంగా చేయడం ద్వారా మన ద్వారా ఏర్పడిన చెత్తను మనమే సంపద లాగా సృష్టించడం జరుగుతోందన్నారు..

అదే విధంగా వీధులను కూడా శుభ్రంగా ఉంచేలా పంచాయతీ బాధ్యత తీసుకోవాలని, గ్రామస్థులందరూ పరస్పర సహకారంతో తమ గ్రామాలను శుభ్రంగా ఉంచుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. మన ఊరు, మన ఇల్లు, మన వీధిని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజలలో ఉండాలన్నారు.

శుభ్రంగా లేకపోతే వైరస్, బ్యాక్టీరియా ల ద్వారా అంటువ్యాధులు సోకే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.. గ్రామ పంచాయతీలో ఆయా వీధుల్లో నివసించే ప్రజలు ఒక చిన్న గ్రూప్ గా ఏర్పడి తమ వీధిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు..ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర”కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.

గ్రామమును శుభ్రంగా ఉంచుకోవడానికి ఈ గ్రామ సర్పంచ్ చాలా బాగా పని చేశారని కలెక్టర్ సర్పంచ్ ను అభినందించారు.. గోనెగండ్ల లో పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన ఉందని, మండల కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచి అవార్డులు పొందాలని కలెక్టర్ ప్రోత్సహించారు..

అనంతరం క్లాప్ మిత్రా లను కలెక్టర్ శాలువ తో సత్కరించారు..

కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జడ్పీ సీఈఓ నాసరారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, డిపిఓ భాస్కర్, సర్పంచ్ హైమవతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *