- అమ్మను గెలిపించేందుకు తనయుల ఆరాటం
- గ్రామంలో ఇంటింటికి వెళ్లి జోరుగా ప్రచారం
తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామ సర్పంచుగా పట్లోళ్ల చంద్రకళకు పట్టం కట్టాలని ఆమె కుమారులు కోరుతున్నారు. ఆదివారం పట్లోళ్ల చంద్రకళ తరుపున ఆమె భర్త, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, కుమారులు ప్రదీప్ రెడ్డి, సందీప్ రెడ్డిలు జోరుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక నేతలు, వార్డు సభ్యులు, మహిళలు, యువకులతో కలిసి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఎన్నికల్లో చంద్రకళను గెలిపిస్తే గ్రామం రూపు రేఖలు మారుస్తామని అన్నారు.
అందరి ఆదరాభిమానాలతో సర్పంచుగా అవకాశం కల్పిస్తే గ్రామంలోని సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధి కోసమే సర్పంచుగా పోటీ చేస్తున్నామని, తమకు ఎలాంటి స్వార్థం లేదని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల్లో కేటాయించిన గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

