చిట్వేలి–రాపూరు ఘాట్‌ రోడ్డులో చిరుతల హల్‌చల్‌

  • ఘాట్‌ రోడ్డుపై కనిపించిన చిరుత.. వీడియో వైరల్‌

తిరుపతి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా చిట్వేలి–రాపూరు ఘాట్‌ రోడ్డులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఘాట్‌ రోడ్డుపై చిరుత సంచరిస్తున్న దృశ్యాలు వాహనదారుల కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిట్వేలి–రాపూరు ఘాట్‌ రోడ్డులో తరచూ చిరుతలు సంచరిస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

అడవికి సమీపంగా ఉన్న ప్రాంతాల్లో చిరుతలు రహదారిపైకి వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా ద్విచక్ర వాహనాలపై ఘాట్‌ రోడ్డులో ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

చిరుతలు కనిపిస్తే వాటిని వెంబడించడం, దగ్గరకు వెళ్లి వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం చేయవద్దని సూచించారు. చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులు నిఘా పెంచి, ప్రయాణికుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.