లేగ దూడపై చిరుత పంజా..

తాడ్వాయి, ఆంధ్రప్రభ: తాడ్వాయి మండలంలో మరోసారి చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నందివాడ గ్రామ పరిధిలోని తిరుమయకుంట తండా సమీపంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. తండాకు చెందిన జాదవ్ సంతోష్‌కు చెందిన లేగ దూడ రెండు రోజులుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పరిసర అటవీ ప్రాంతంలో వెతికినా ఆచూకీ లభించలేదు. గళవారం అటవీ ప్రాంతంలో మేకల కాపరులు ఇచ్చిన సమాచారంతో సంతోష్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడ లేగ దూడ మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. చిరుత పులి దాడి చేయడం వల్లే లేగ దూడ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన లేగ దూడ విలువ సుమారు రూ.35 వేల వరకు ఉంటుందని బాధితుడు జాదవ్ సంతోష్ పేర్కొన్నారు.