ఈ నెల 3, 4 తేదీల్లో న్యాయవాదుల సంఘం రాష్ట్ర మహాసభలు

నరసాపురం, ఆంధ్రప్రభ: అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఏఐఎల్‌యూ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 13వ మహాసభలు ఈ నెల 3, 4 తేదీల్లో నెల్లూరులో నిర్వహించనున్నట్లు ఆ సంఘం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి పూరిళ్ల శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు మహాసభలు జరుగుతాయని చెప్పారు.

ఈ కార్యక్రమానికి పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అంజనా ప్రకాశ్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ రాజు రామచంద్రన్‌, ఏఐఎల్‌యూ జాతీయ అధ్యక్షుడు, పార్లమెంట్‌ మాజీ సభ్యుడు బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, సంఘం ప్రధాన కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది పి.వి. సురేంద్రనాథ్‌ తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి న్యాయవాదులు ఈ మహాసభలకు హాజరవుతారని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.

ప్రధానంగా న్యాయవాదుల రక్షణ చట్టం అమలు, ఆరోగ్య బీమా కార్డుల మంజూరు, జూనియర్‌ న్యాయవాదులకు స్టైపెండ్‌, వృత్తిపరమైన శిక్షణ తరగతుల నిర్వహణ, న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను చర్చించనున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యాచరణ, ఆందోళనా కార్యక్రమాలపై కూడా మహాసభల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు శ్రీనివాస్‌ వివరించారు.