అమెరికాలోని ఫ్లోరిడాలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. హైవేపై చట్టవిరుద్ధంగా యూ-టర్న్ తీసిన వ్యక్తి భారీ ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, నిందితుడికి 45 ఏళ్ల జైలు శిక్ష, ఆపై దేశనిర్బంధం ఎదురుకానుంది. ఒక తప్పిదానికి కఠినమైన శిక్ష విధించడం చట్టాల అమలులో అమెరికా ఎంత సీరియస్‌గా ఉంటుందో చూపిస్తోంది.
అయితే, ఈ ఘటనను చూసి నెటిజన్లు భారత్‌తో పోల్చక మానడం లేదు. ఎందుకంటే భారతదేశంలో చట్టాలు ఉన్నా అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయి. రోడ్లపై మాత్రం అవి అమలు కావడం లేదన్న వాస్తవం మరోసారి బహిర్గతమైందంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
దేశంలో ట్రాఫిక్ నియమాలు ఉన్నా వాటిని పట్టించుకునేవారు తక్కువ. డ్రైవింగ్ లైసెన్సులు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేకుండా కొనుక్కోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మైనర్లు కూడా ఎలాంటి భయం లేకుండా లగ్జరీ కార్లు నడపడం, రేసింగ్ చేయడం, ప్రమాదాలు చేసి పారిపోవడం సాధారణమైపోయింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భాల్లో లంచం ఇస్తే సరిపోతుందన్న ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి.
2024 మేలో పుణేలో జరిగిన ఘటన ఈ విషయాన్నే మరింత స్పష్టంచేసింది. 17 ఏళ్ల మైనర్ ఒక పోర్షేను వేగంగా నడిపి ఇద్దరిని బలిగొన్నాడు. అయితే అతనికి ఇచ్చిన శిక్ష కేవలం రోడ్ సేఫ్టీపై 300 పదాల ఎస్సే రాయడం. ఇది శిక్ష కాదని, నాటకమని, డబ్బు, ప్రభావం ఉంటే ఎంత పెద్ద నేరం చేసినా తప్పించుకోవచ్చని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదే తరహా ఘటన 2016లో ఢిల్లీలో చోటుచేసుకుంది. ఒక జువెనైల్ మెర్సిడెస్‌ను వేగంగా నడిపి ఢీకొట్టడంతో 32 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఇన్షూరెన్స్ కంపెనీతో రూ.1.98 కోట్ల నష్టపరిహారం అందజేశారు.
2023లో కాన్పూర్‌లో మరో ఘటన జరిగింది. 15 ఏళ్ల డాక్టర్ కుమారుడు కారు నడుపుతూ ఇద్దరిని ఢీకొట్టి మృతికి కారణమయ్యాడు. కొన్ని నెలలకే అతను మళ్లీ మరో ప్రమాదానికి కారణమై నలుగురిని గాయపరిచాడు. అయినప్పటికీ అతను మొదట బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే, పూణే పోర్షే ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపిన తర్వాతే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నది సామాన్యులే. కానీ డబ్బు, ప్రభావం ఉన్నవారు మాత్రం బాధ్యతల నుండి, శిక్షల నుండి తప్పించుకుంటున్నారు. నేరాన్ని డ్రైవర్లపై నెట్టడం, దర్యాప్తులను ప్రభావితం చేయడం భారతదేశంలో సాధారణంగా మారిపోయిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నది ఈ ఉదాహరణలన్నీ స్పష్టంగా రుజువు చేస్తున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
బాధ్యతను గౌరవించకపోవడం, క్రమశిక్షణను పట్టించుకోకపోవడం, ముఖ్యంగా మానవ ప్రాణాలను లెక్క చేయకపోవడమే ఈ సమస్యల అసలు మూలమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభావవంతులకి చట్టాలు వేరుగా, సామాన్యులకి వేరుగా ఉంటాయా అని ప్రశ్నిస్తున్న వారు, ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భారత రహదారులు ఎప్పటికీ మరణ ఉచ్చులుగానే మిగిలిపోతాయని హెచ్చరిస్తున్నారు.