బీసీలకు 34శాతం రిజర్వేషన్ అమలుకు చట్టం..
మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందని రాష్ట్ర భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
మచిలీపట్నం అర్బన్ బ్యాంకులో బుధవారం స్వర్గీయ మాజీ మంత్రి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించి మంత్రి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు నిజమైన రాజకీయ స్వాతంత్ర్యం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే లభించిందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలను గుర్తించి వారికి రాజకీయంగా పదవులు కల్పించారని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 34 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడంతో సుమారు 16,800 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు దూరమయ్యాయని మంత్రి ఆరోపించారు. భవిష్యత్తులో బీసీల రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 34 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
