ఉపనిషత్తుల పరమార్థమే సనాతన ధర్మం..
సకల ప్రజల శ్రేయస్సు ద్యేయంగా నిలిచేదే నిజమయిన సనాతన దర్మం..
సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి..
భువనగిరి అక్టోబర్ 6 (ఆంధ్రప్రభ): సకల ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా నిలిచేదే నిజమైన సనాతన ధర్మమని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక దివ్యక్షేత్రమైన రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ గ్రంథావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు, మహామండలేశ్వరులు, ఆశ్రమాధిపతులు హాజరయ్యారు. శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్, హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, ఆధ్యాత్మికవేత్త చెన్నప్ప అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి మాట్లాడుతూ.. వేద వేదాంగాలు, ఉపనిషత్తుల పరమార్థమే సనాతన ధర్మమని మానవాళికి ఈ ధర్మాన్ని సులభంగా అందించేందుకే ఈ గ్రంథాన్ని సంస్కృతంలో రచించానని తెలిపారు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలుగు తాత్పర్యంతో పాటు వివరమైన వివరణ కూడా జోడించినట్లు పేర్కొన్నారు. ఈ సభలో భక్తుల ప్రయోజనార్థం గ్రంథంలోని ముఖ్యమైన 9 దివ్య సూత్రాలను మహర్షి స్వయంగా విడమరిచి బోధించారు.
సనాతన ధర్మంపై సరైన అవగాహన పెంచుకోవడానికి ఈ గ్రంథం ఒక విశిష్ట మార్గదర్శకమని, ప్రతి హిందువూ అధ్యయనం చేయదగిన దివ్య గ్రంథమని సభకు విచ్చేసిన జగద్గురువులు కొనియాడారు. సనాతన ధర్మం అనాది అయినదని, దానికి ఆరంభం లేదని వివరించిన వారు ప్రతి ఒక్కరూ అంతర్ముఖ సాధన, ఆత్మజ్ఞానం మరియు దైవానుభూతి ద్వారా తమ ఆత్మలోని దైవాన్ని దర్శించడమే ధర్మపు అసలైన సారమని ప్రవచించారు.
సనాతన ధర్మం అనాది, విశ్వవ్యాప్తం, సర్వధర్మాలకు మూలం.. దీనికి మూల దైవం శివుడు, మూల శాస్త్రం వేదం, మూల సిద్ధాంతం అద్వైతం, మూల గురువు సదాశివుడు, మూల సాధనం ధ్యానం, లక్ష్యం ఆత్మసాక్షాత్కారం, ఆరాధించాల్సిన గురువు సిద్ధగురువు అనే సూత్రాలను శ్రీ రమణానంద మహర్షి గ్రంథం లోని ముఖ్యమైన అంశాలను వివరించారు. ఆధ్యాత్మిక ప్రముఖులకు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
కార్యక్రమంలో భాగంగా బంగారు శివలింగానికి విశేష అభిషేకం నిర్వహించిన అనంతరం అతిథులు జ్యోతిర్మండల ఆలయంలోని నక్షత్ర, నవగ్రహ, రాశ్యాత్మక దేవతలను దర్శించుకున్నారు. ఆ తర్వాత వేదికపై జగద్గురువులు, పీఠాధిపతుల సమక్షంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి సంస్కృతంలో రచించిన ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ గ్రంథాన్ని దివ్యంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్ధగురువులు ఆధ్యాత్మిక ప్రముఖులను పేరుపేరునా సత్కరించగా, వచించిన 1008 సంస్కృత సూత్రాల రచనను అతిథులు ఆశీర్వదించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలోభక్తులు తరలివచ్చారు.
