బుర్రిపాలెంలో 3డీ ఇళ్లకు శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
రూ.14 కోట్లతో 117 ఇళ్ల నిర్మాణం
తెనాలి, ఆంధ్రప్రభ: గృహ నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

తెనాలి మండలం బుర్రిపాలెం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హాజరయ్యారు. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో రూ.14 కోట్ల వ్యయంతో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ సాంకేతికత ద్వారా 117 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా 3డీ ప్రింటింగ్‌ ద్వారా ఇళ్ల నిర్మాణం జరిగే విధానాన్ని సీబీఆర్ఐ అధికారులు సీఎంకు, కేంద్ర మంత్రులకు వివరించారు.
పది రోజుల్లో ఇల్లు పూర్తి
సంప్రదాయ నిర్మాణ విధానానికి భిన్నంగా 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో కేవలం పది రోజుల్లోనే ఒక ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని సీబీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ సాంకేతికతను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి వినియోగించే అవకాశాలను వివరించారు. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన 117 ఇళ్ల నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని సీబీఆర్ఐ సిబ్బంది తెలిపారు.
ఆసక్తిగా పరిశీలించిన సీఎం
3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఆసక్తిగా పరిశీలించారు. భవిష్యత్తులో వేగం, నాణ్యంగా ఇళ్ల నిర్మాణానికి ఈ సాంకేతికతను విస్తృతంగా వినియోగించే అంశంపై అధికారులు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, గుంటూరు జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయికాంత్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.