రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
- రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమక్షంలోనే సమగ్ర భూ సర్వే..
- వచ్చే ఏడాదిలోగా ప్రతి అంగుళం భూమి సర్వే చేయాలని లక్ష్యం
- క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల సమక్షంలోనే పరిష్కరిస్తాం
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేపడుతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి సమక్షంలోనే భూముల రీసర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి, భూ యజమానులకు వివాదరహిత భూముల రికార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రీసర్వే జరిగే గ్రామాల్లో తహసీల్దార్లు ప్రతిరోజూ పర్యటించాలని మంత్రి సూచించారు. ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, కనీసం వారానికి ఒకరోజైనా సర్వే జరుగుతున్న గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు. భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో భద్రతతో కూడిన భూ రికార్డులు, పాస్‌బుక్కులు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

125 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో సర్వే
బుధవారం మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన భూ సర్వే, రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, హౌసింగ్ అంశాలపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డి. శ్రీధర్‌బాబుతో కలిసి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 125 ఏళ్ల క్రితం జరిగిన సర్వే తర్వాత రాష్ట్రంలో మరోసారి ఇంత విస్తృత స్థాయిలో సమగ్ర భూ సర్వే చేపడుతున్నట్లు వివరించారు. తొలివిడతలో ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో సర్వేను వేగంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించామని, ప్రస్తుతం నేరుగా జిల్లాలకు వచ్చి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందితో సమస్యలను చర్చిస్తున్నామని చెప్పారు.
క్షేత్రస్థాయి సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం
మండల స్థాయి అధికారుల జాబితా నుంచి యాదృచ్ఛికంగా అధికారులను ఎంపిక చేసి, ఆయా మండలాల్లో సర్వేకు సంబంధించిన అంశాలు, పెండింగ్ దరఖాస్తులు, ప్రజల అభ్యంతరాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై నేరుగా చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు.అధికారులు సమస్యలను దాచకుండా వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వ స్థాయిలో అవసరమైన అనుమతులు, మార్గదర్శకాలు కల్పించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిజాయితీగా పనిచేసే అధికారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఉద్దేశపూర్వకంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
భూ హద్దుల వివాదాలకు చెక్
సమగ్ర భూ సర్వే కేవలం భూముల కొలతలకే పరిమితం కాదని మంత్రి పేర్కొన్నారు. సర్వే నంబర్లు ఒకచోట ఉండటం, భూముల వాస్తవ స్వాధీన స్థితి మరోచోట ఉండటం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూముల సమస్యలు, భూముల హద్దులకు సంబంధించిన వివాదాలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు.
22-ఏ సమస్యల పరిష్కారానికి ఆదేశాలు
22-ఏ భూములకు సంబంధించి ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, మెమోల పరిధిలోకి రాని సమస్యలు ఏమైనా ఉన్నాయో పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాంటి సమస్యలను గుర్తించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సమగ్ర భూ సర్వే విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మనోహర్‌రెడ్డి, అరికపూడి గాంధీ, బండారు లక్ష్మారెడ్డి, ఈర్లపల్లి శంకర్, మర్రి రాజశేఖరరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

