కేపీహెచ్‌బీలో ధ‌ర‌ల‌కు రెక్క‌లు..

  • గజం రూ.2.70 లక్షలు..
  • 16 ఎంఐజీ ప్లాట్ల వేలం..
  • హౌసింగ్‌ బోర్డుకు రూ.47.14 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో భూములకు రికార్డు ధర న‌మోదైంది. బుధవారం జరిగిన వేలంలో గజం గరిష్టంగా రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో 16 ఎంఐజీ ఓపెన్‌ ప్లాట్లను వేలం వేశారు. మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. గజం సగటు ధర రూ.1.79 లక్షలుగా నమోదైంది. ఈ వేలం ద్వారా హౌసింగ్‌ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఇదే 7వ ఫేజ్‌లో గజం రూ.2.98 లక్షలకు అమ్ముడైంది. 2025 జూన్‌లో జరిగిన వేలంలో ఈ ధర నమోదైంది. అప్పట్లో ఇదే అత్యధిక ధరగా నిలిచింది. తాజాగా గజం రూ.2.70 లక్షలు పలకడం మరోసారి కేపీహెచ్‌బీ భూములకు ఉన్న డిమాండ్‌ను చాటిచెప్పింది.

ఈరోజు జరిగిన వేలంలో 16 ఎంఐజీ ఓపెన్‌ ప్లాట్లకు భారీ స్పందన లభించింది. ఒక్కో ప్లాట్‌కు బిడ్డర్ల మధ్య పోటీ నెలకొంది. ప్రారంభ ధరతో పోలిస్తే గరిష్ట బిడ్‌ గణనీయంగా పెరిగింది. దీంతో హౌసింగ్‌ బోర్డుకు భారీ ఆదాయం సమకూరింది. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో ఈరోజు జరిగిన వేలానికి గజానికి రూ.1.60 లక్షలను ప్రారంభ ధరగా నిర్ణయించారు. ఒక్కో ప్లాట్‌ విస్తీర్ణం 194.44 చదరపు గజాలు. ప్రారంభ ధర కంటే గరిష్ట బిడ్‌ భారీగా పెరిగింది. ప్రభుత్వ భూములపై కొనుగోలుదారుల్లో ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనంగా నిలిచింది.

కేపీహెచ్‌బీకి ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండటం కలిసొస్తోంది. మెట్రో రైలు అందుబాటులో ఉండటం మరో సానుకూల అంశం. ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన నివాస ప్రాంతం కావడంతో డిమాండ్‌ కొనసాగుతోంది. కేపీహెచ్‌బీలో నివాస ప్లాట్లతో పాటు వాణిజ్య స్థలాలు, ఫ్లాట్లకు కూడా డిమాండ్‌ ఉంది. గతంలో ఫేజ్‌-4లోని వాణిజ్య స్థలం ఎకరాకు రూ.65.34 కోట్లకు అమ్ముడైంది. గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోనూ హౌసింగ్‌ బోర్డు భూములకు భారీ ధరలు వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల వేలంపాటలకు ప్రాధాన్యం పెరుగుతోంది.