TG | భూమి కోసం దారుణం…

TG | భూమి కోసం దారుణం…

మహిళ దారుణ హత్య చేసిన బంధువులు!
ఎకరంన్నర భూమి వివాదమే హత్యకు కారణం
మహిళ గొంతు కోసి హత్య..
నలుగురు నిందితులు అదుపులోకి


TG | మహబూబ్‌నగర్‌, ఆంధ్రప్రభ : ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. భూమి కోసం కుటుంబ సభ్యులే హత్య చేసిన దారుణ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కోయిలకొండ మండలం చింతల్‌ తండాకు చెందిన సునీత (28) ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఎకరంన్నర భూమితో మొదలైన వివాదం…
సునీతకు భర్త బలరాంతో కొంతకాలంగా కుటుంబ కలహాలు, విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. వారి తీర్పు మేరకు బలరాంకు చెందిన ఎకరంన్నర వ్యవసాయ భూమిని సునీత పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. అప్పటి నుంచి కుటుంబంలో ఆస్తి విషయంలో వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది.

పొలం వద్దకు వెళ్తుండగా హత్య…
సునీత పొలం వద్దకు వెళ్తున్న సమయంలో బలరాం సోదరులు, వారి కుటుంబ సభ్యులు, మరో వ్యక్తి ఆమెను ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారంతా కలిసి ఆమెపై దాడి చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో తల, మొండెం వేరయ్యేలా నరికి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నలుగురు నిందితులు అదుపులోకి…
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి వివాదమే హత్యకు ప్రధాన కారణమా? ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల తదుపరి దర్యాప్తులో వెల్లడికానున్నాయి.