పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలి

కిష్టంపేట, రేపల్లెవాడల్లో కేవీకే శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శన

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటించి పంటల్లో అధిక దిగుబడులు సాధించాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. బెల్లంపల్లి మండలంలోని కిష్టంపేట, రేపల్లెవాడ గ్రామాల్లో బుధవారం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం పర్యటించి పత్తి, వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ పత్తి పంటలో కలుపు నివారణకు క్విజాలోఫాప్‌ ఇథైల్‌, పైరిథియోబాక్‌ సోడియం మందులను ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. పంటను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ కలుపు, చీడపీడల నియంత్రణకు అవసరమైన యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు.

అనంతరం వరి పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు సమస్యాత్మక నేలల్లో నీటిని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు బయటకు తీసివేస్తూ ఆరుతడి విధానాన్ని పాటించాలని సూచించారు. పంట ఎదుగుదలకు 19:19:19 లేదా మల్టీ-కె వంటి నీటిలో కరిగే ఎరువులను ఆకులపై పిచికారీ చేయాలని తెలిపారు.

నేలల్లో సేంద్రియ కర్బనాన్ని పెంచేందుకు తదుపరి పంటకు ముందు పచ్చిరొట్ట ఎరువుల పంటలను సాగు చేసి నేలలో కలియదున్నాలని రైతులకు వివరించారు. పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా సాగు ఖర్చులను నియంత్రించడంతో పాటు దిగుబడిని మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ మధు, డాక్టర్‌ ఎన్‌. మహేష్‌, పి. సాధ్వి, మండల వ్యవసాయ అధికారి సుష్మ, వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్‌, స్థానిక రైతులు పాల్గొన్నారు.