కర్నూలు పోలీసుల చాకచక్యం

కర్నూలు పోలీసుల చాకచక్యం

  • 20 కిలోల గంజాయి స్వాధీనం


( ఆంధ్రప్రభ, కర్నూలు క్రైం) : అతి తక్కువ ఖర్చు.. శ్రమతో లక్షలకు లక్షలు సంపాదించాలనే అత్యాశతో గంజాయి దందాలో దిగిన ఐదుగురు ముఠా సభ్యులను కర్నూలు (Kurnool) పోలీసులు పట్టేశారు. ఓ కారును రోజువారీ అద్దెకు తీసుకుని, అరకు వ్యాలీ లాడ్జీలో మకాం వేసి .. చెక్ పోస్టుల కళ్లు గప్పి.. కిలోల కొద్దీ గంజాయిని తరలించి.. రాయలసీమలో గంజాయ్ డాన్ లు ఎదగాలనుకున్న ఈ ముఠా ప్రస్తుతం పోలీసులకు ఈజీగా దొరికారు. అరదండాలతో జైలుకు వెళ్లారు. కర్నూలు డీఎస్పీ బాబూ ప్రసాద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా పంచలింగాల ప్రాంతంలోని మాదన్న నగర్ కు చెందిన మీనుగ నరేంద్ర, కర్నూలు నగరంలోని ధర్మపేటకు చెందిన నల్లగొట్టి ఉమేష్ చంద్ర, కర్నూలు జిల్లా కోర్టు సమీపంలోని ఎస్ ఎస్ నగర్ కు చెందిన సిరిగిరి మృత్యుంజయ రెడ్డి, ఎస్పీఐ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ ఆరిఫ్, కర్నూలు కొత్తపేటకు చెందిన పగిద్యాల చాకలి గోవర్ధన్ స్నేహితులు. కరో కరో జల్సా గ్యాంగ్. ఈ స్థితిలో అనతి కాలంలోనే కోటీశ్వరులు కావాలని చర్చించుకున్నారు. కేవలం గంజాయి (Marijuana) దందాతోనే ఈజీ మనీ సాధ్యమని ఓ పథకాన్ని రచించారు. వెంకట రమణ కాలనీకి చెందిన మురళి అనే వ్యక్తి కారును రోజుకు రూ.3వేలు బాడుగకు తీసుకున్నారు. గురువారం టొయోటా గ్లాంజా కారు (AP 40N 3256 )లో అరకు వెళ్లి అక్కడ లాడ్జీలోని అద్దెకు దిగారు. ఒడిశా సరిహద్దులో రూ.80 వేలకు 20 కిలోల గంజాయిని కొన్నారు. కర్నూలు వెళ్లిన తరువాత గంజాయిని పొట్లాల రూపంలో మార్చి ఒక్కొక్క పాకెట్ ను రూ.500లకు అమ్మితే కనీసం రూ.4 లక్షలు వస్తాయని ఆశపడ్డారు. శనివారం అరకు నుంచి కర్నూలుకు బయలుదేరారు. ఇక్కడ డామిట్ కథ అడ్డం తిరిగింది.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ (Odisha, Andhra Pradesh) రాష్ట్రాల సరిహద్దు నుంచి పెద్ద మొత్తంలో గంజాయి కర్నూలుకు రవాణా జరుగుతున్నట్టు కర్నూలు ఎస్పీకి ఉప్పందింది. కర్నూలు నాలుగవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోనే గంజాయి దందా జరుగుతోందని ఈ సమాచారం అందడంతో… తమ సిబ్బందిని ఎస్పీ అలెర్ట్ చేశారు. డీఎస్పీ బాబూ ప్రసాద్ రంగంలోకి దిగారు. బాలు ప్రసాద్ నాయకత్వంలో కల్లూర్ తహసిల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు నాలుగో పట్టణ సీఐ విక్రమ్ సింహ చంద్రశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ ఖాద్రి, సాకిరీ, శ్రీనివాసులు, పోలీస్ కానిస్టేబుల్స్ మురళీధర్, సుబ్బరాయుడు, రాఘవేంద్ర ఖాజాల లో బళ్లారి చౌరస్తా సమీపంలోని ఓవర్ బ్రిడ్జి మీద మకాం వేశారు. వాహనాల తనిఖీ ప్రారంభించారు.

ఒక తెల్లని టయోటా కారు (AP 40N 3258) ను తనిఖీ చేశారు. పోలీసు ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు రావడంతో కారులోని ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అరకు విహార యాత్రకు వెళ్లలేదని, అక్కడి నుంచి గంజాయి తీసుకువచ్చామని కల్లూర్ తహసిల్దార్ ఆంజనేయులు సమక్షంలో అంగీకరించారు. చెక్ పోస్టుల తనిఖీల్లో బయట పడకుండా సదరు కారు నాలుగు డోర్ల లోపలి భాగంలోని ప్లాస్టిక్ భాగాన్ని ఓపెన్ చేసి ఆ డోర్లలో ప్లాస్టిక్ రాపర్లలో గంజాయిని చుట్టి తీసుకువచ్చిన విషయం తేలింది. గంజాయి ముఠా ధీరులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 20 కేజీల గంజాయి పాకెట్లను, టయోటా గ్లాంజా కారును సీజ్ చేశారు.

Leave a Reply