కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి

రిలే నిరాహార దీక్షలో 50 మందికి పైగా మహిళా న్యాయవాదులు..
జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన

కర్నూలు రూరల్‌ బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రాంతానికి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం 50 మందికి పైగా మహిళా న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా కర్నూలు, ఏపీ హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వై. జయరాజు దీక్షలో పాల్గొన్న మహిళా న్యాయవాదులకు పూలు అందించి అభినందించారు. రాయలసీమ ప్రాంతానికి గత ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పదేపదే అన్యాయం చేశాయని ఆయన పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయని తెలిపారు.

జాప్యానికి కారణమేంటి?

హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు ప్రక్రియపై వై. జయరాజు వివరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసే అధికారం కలిగి ఉందని పునరుద్ఘాటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటును మరింత ఆలస్యం చేయడానికి ఎలాంటి సమర్థనీయత లేదని అన్నారు.

రాయలసీమకు న్యాయపరమైన సౌలభ్యం కల్పించేందుకు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. ఇచ్చిన హామీని అమలు చేసి ప్రాంతీయ న్యాయ అవసరాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమానికి కేడీబీఏ అధ్యక్షుడు బి. చంద్రుడు అధ్యక్షత వహించగా, సీనియర్‌ న్యాయవాది వి. నాగలక్ష్మీదేవి సమన్వయకర్తగా వ్యవహరించారు. పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.