విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన..

విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన..

ఆత్మవిశ్వాసమే విజయానికి తొలి అడుగు: అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా

కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కర్నూలు పట్టణం కప్పల్ నగర్‌లోని చైతన్య స్కూల్‌లో విద్యార్థినులకు భద్రత, ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఆత్మవిశ్వాసం అత్యంత కీలకమని పేర్కొన్నారు. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంపొందించుకోవాలంటే నిరంతర సాధన అవసరమని, ఏకాగ్రతతో కృషి చేస్తే లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని తెలిపారు.

మనసును దృఢంగా ఉంచుకుని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు తమపై నమ్మకం పెంచుకుంటూ ప్రతిరోజూ సాధన చేస్తే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని చెప్పారు. బాధ్యతగల పౌరులుగా ఎదగాలని, విద్యతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించే సామర్థ్యం కలవారని, ధైర్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో భాగంగా కరాటే మాస్టర్లు విద్యార్థినులకు ఆత్మరక్షణ పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శన (డెమో) నిర్వహించారు.

ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండేందుకు పాటించాల్సిన ముఖ్యమైన టెక్నిక్స్‌ను వివరిస్తూ ప్రాక్టికల్‌గా చూపించారు. ఆత్మరక్షణ విద్య ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జె. బాబు ప్రసాద్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రామయ్యనాయుడు, టూ టౌన్ సీఐ నాగరాజారావు, ఎస్సై శివాంజల్, చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ మంజుల, ఎఓ పరమేశ్వర్ రెడ్డి, కరాటే మాస్టర్లు శ్రీనివాసులు, ఫాతిమా, ఉపాధ్యాయులు మరియు సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply