అంగన్వాడీల ద్వారా సంతృప్తికరమైన సేవలందించాలి….

అంగన్వాడీల ద్వారా సంతృప్తికరమైన సేవలందించాలి….
జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ ని అరకట్టాలి…
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు సంతృప్తికరమైన సేవలందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సీడీపీఓలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులతో శాఖ పనితీరుపై డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ…శాఖకు సంబంధించిన సూచికల్లో కర్నూలు జిల్లా చివరి స్థానాల్లో ఉండటం ఆందోళనకరమని పేర్కొంటూ, దీనిని సవాలుగా తీసుకుని పనితీరులో స్పష్టమైన మార్పులు తీసుకురావాలని, ప్రజలు సంతృప్తి చెందేలా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య పరీక్షలు, గర్భిణీలు, బాలింతలు, 0–6 ఏళ్ల పిల్లలకు సకాలంలో, నాణ్యతతో సేవలు అందించాలన్నారు. తీసుకోవాలని ఆదేశించారు.

లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఇది శాఖపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, విద్య, ఆట సామగ్రి వంటి ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి కేంద్రాన్ని ఆదర్శ అంగన్వాడీగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. పెద్ద కడబూరు, ఆస్పరి, మంత్రాలయం, కోసిగి, కౌతాళం, హోళగుంద మండలాల్లో సేవలందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పోషణకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లు వెచ్చిస్తోందని, ప్రతి అర్హుడికి లబ్ధి చేరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన ఈ అంశంపై క్షేత్ర స్థాయిలో బాగా పనిచేసి సేవల నాణ్యతను పెంచాలని డైరెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో టీనేజ్ గర్భధారణలు అరికట్టాలి….
జిల్లాలో టీనేజ్ గర్భధారణలను పూర్తిగా అరికట్టేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరును గణనీయంగా మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, తక్షణ చర్యల ద్వారా ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపొందించాలని స్పష్టం చేశారు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల మరమ్మత్తులు మొదటి వారంలోనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ అంశాలపై ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా అధికారులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండవ వారంలో గర్భిణీలు, బాలింతలలో ప్రభుత్వ పథకాలపై, పోషకాహార ప్రాముఖ్యతపై, ప్రజా సేవలపై అవగాహన కల్పించాలని తెలిపారు. లబ్ధిదారుల సంతృప్తి స్థాయి పెరగాలని, వారిలో విశ్వాసం పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలని చెప్పారు. పోషకాహార నాణ్యతపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ గర్భిణీలు, బాలింతలకు అందించే టేక్ హోమ్ రేషన్ (THR) సమయానికి అందజేయాలని ఆదేశించారు. పాలు, గుడ్లు, ఇతర పోషకాహార పదార్థాల నాణ్యతను ముందుగా పరీక్షించి పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడరాదని హెచ్చరించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం ఉదయం 9 గంటలలోపు తప్పనిసరిగా ప్రారంభమవ్వాలని ఆదేశించారు.
ఫీల్డ్ స్థాయిలో సూపర్వైజర్లు, సీడీపీఓలు ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అంగన్వాడీ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. టీనేజ్ గర్భధారణలు తగ్గించడమే కాకుండా, తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణలో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో మహిళా మరియు శిశు సంక్షేమ సేవలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌జెడి రోహిణి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, సీడీపీఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
