Kurnool | ఔషధ మొక్కల సాగుతో ఆర్థిక భరోసా…

Kurnool | ఔషధ మొక్కల సాగుతో ఆర్థిక భరోసా…

  • విస్తృత పర్యటనలో సిఈఓ చంద్రశేఖర్

Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఔషధ మొక్కల సాగుతో రైతులకు ఆర్థిక భరోసా ఖాయమని ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ అన్నారు. వరుసగా మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలను విస్తృతంగా సాగించారు. తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురము, కర్నూలు జిల్లాల రైతులతో ఆయన నేరుగా కలిసి మాట్లాడారు. ఔషధ మొక్కలు సాగు చేస్తున్న పొలాలకు బుధవారం స్వయంగా వెళ్లి పరిశీలించారు. అధిక దిగుబడి సాధించిన రైతులను ప్రత్యేకంగా అభినందించారు.

మార్కెటింగ్ అవకాశాలను, మెళకువలను వారికి వివరించారు. పలుచోట్ల ఔషధ తయారీ పరిశ్రమలను, కృషి విజ్ఞాన కేంద్రం, పరిశోధనాశాలలను సిఈఓ సందర్శించారు. ఉదయం అనంతపురం జిల్లా కసాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్నూలు జిల్లా ఆలూరు, అత్తి బెళగల్, జోహారాపురం, మంత్రాలయం, బనవాసి లోని కృషి విజ్ఞాన కేంద్రంలో పర్యటించారు. ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి విత్తన జన్యు పదార్థ కేంద్రము, అశ్వగంధ విత్తన ఉత్పత్తి నర్సరీలను పరిశీలించారు. ఆధునిక పద్ధతుల్లో వర్మీ కంపోస్ట్ తయారీని, తేనె ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Kurnool |

ఈ సందర్భంగా సిఈఓ వెంట ఉప సిఈఓ ప్రదీప్, కార్తీక్, సమన్వయకర్త రాఘవేంద్ర చౌదరి, పలువురు అధికారులు, రైతులు వున్నారు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఇసుక, మట్టి, వేర్లను ఏపీఎంఏపీ బోర్డు సిఈఓ ఆవుల చంద్రశేఖర్ పరిశీలించారు. గుజరాత్ నుంచి తీసుకొచ్చిన వల్లభ రకం, అశ్వగంధ పంట అధిక దిగుబడి సాధించడం పట్ల రైతులను అభినందించారు. కర్నూలు జిల్లాలో సాగవుతున్న ఔషధపంట కోతకు వచ్చిన సమయంలో, పుష్టి ఎలా వుందని అడిగి తెలుసుకున్నారు. పంట దిగుబడిని గోదాముల్లో గల నిల్వచేయాలో వివరించారు.

Kurnool |

నూతన పరిశోధనలను కొనసాగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులను ప్రోత్సహించారు. జిల్లాలో కుసుమ పంట బాగా రావడంతో దాని ప్రయోజనాలను సిఈఓ చంద్రశేఖర్ ప్రత్యేకంగా వివరించారు. కుసుమ నూనె, పూలు, విత్తనాలు వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రక్త ప్రసరణ మెరుగుదల, రుతుస్రావం క్రమబద్ధీకరణ, చెడు కొవ్వు నియంత్రణ, గుండె జబ్బుల నివారణకు వాడతారని చెప్పారు. రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి చర్మవ్యాధుల చికిత్సకు, ఎముకల పటుత్వానికి, కీళ్లనొప్పుల నియంత్రణకు, రక్తశుద్ధికి, జ్వరం తగ్గడానికి ఇది పనికొస్తాయన్నారు.

Kurnool |

Leave a Reply