Kurnool | వైసీపీది అబ‌ద్దాల‌ ప్రచారం..

Kurnool | వైసీపీది అబ‌ద్దాల‌ ప్రచారం..

  • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వాస్తవాలను గుర్తించాలి
  • టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ధ్వ‌జం

Kurnool | కర్నూలు, ఆంధ్రప్రభ : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వైసీపీ కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, వాస్తవాలను విస్మరించి రాజకీయ ఆరోపణలకు పాల్పడుతోందని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు.

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిగా నిలిచిపోయిన వాస్తవాన్ని వైసీపీ నాయకులు కావాలనే మరచిపోతున్నారని ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాల కారణంగా ప్రాజెక్టులపై న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడినప్పటికీ, 2019–2024 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వం కోర్టుల్లో చిత్తశుద్ధితో పోరాడి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి జనవరి మూడవ తేదీన శాసనసభలో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు నిలిపివేయించామని ప్రకటించిన సందర్భంలో, ఆ ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రాష్ట్ర హక్కుల కోసం నిలబడాల్సిన బాధ్యతను గత ప్రభుత్వం నిర్వర్తించలేదని వ్యాఖ్యానించారు.

2014–2019 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై సుమారు 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నది వాస్తవమా కాదా అన్న విషయాన్ని వైసీపీ నాయకులు ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అదే విధంగా 2019–2024 మధ్యకాలంలో ప్రాజెక్టులపై కేవలం రెండు వేల కోట్ల రూపాయల వరకే ఖర్చు జరిగిందని అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నదుల అనుసంధానం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేవలం 18 నెలల్లోనే దాదాపు 6 వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి 3,870 కోట్ల రూపాయలతో ఆంధ్రనివా కాలువ విస్తరణ పనులు చేపట్టి కుప్పం వరకు నీటిని అందించగలిగినదే కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.

ఎన్జీటీ పరిధిలోకి వెళ్లిన అంశాలపై వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లి కనీసం కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడం వారి నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని విమర్శించారు. 2024లో ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రమే కూటమి ప్రభుత్వం న్యాయపరమైన పోరాటానికి శ్రీకారం చుట్టి కౌంటర్ దాఖలు చేసేందుకు ముందడుగు వేసిందని తెలిపారు.కేంద్రం నిలుపుదల విధిస్తే, అప్పటి ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్లే ప్రాజెక్టులు నిలిచిపోయిన వాస్తవాన్ని దాచిపెట్టి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం వైసీపీ అజ్ఞానానికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు వాస్తవాలను గమనించి నిజానిజాలను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.

స‌మావేశంలో కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ పూల నాగరాజ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, నంద్యాల నాగేంద్ర, భాస్కర్ రెడ్డి, భరత్ జేమ్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply