ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి సుజాత సూచన

కుంటాల, ఆంధ్రప్రభ : తక్కువ వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సుజాత సూచించారు. గురువారం కుంటాల మండలంలోని కల్లూరు మన గ్రోమోర్‌, పెంచికల్‌పాడు, అంబకంటి గ్రామాల్లోని పలు ఎరువుల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఎరువులను విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని దుకాణదారులను ఆదేశించారు.

రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు రాబోయే రబీ పంటలకు అవసరమైన విత్తనాలను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని దుకాణదారులకు తెలిపారు. తక్కువ వర్షపాతంతో పండించే పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అనపకాయ, మినుము, పొద్దుతిరుగుడు తదితర ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలను వివరించారు. వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేనందున అధిక నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విక్రమ్‌, ఎరువుల దుకాణాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.