అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు
రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ర్యాలీ
కుంటాల, ఆంధ్రప్రభ : రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి నాయకుల అరెస్టును ఖండిస్తూ కుంటాలలో కాంగ్రెస్ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరే ఆనంద్‌రావు పటేల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని, ఎంతకైనా పోరాటం చేస్తామని తెలిపారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఇండియా కూటమి నాయకుల పోరాటాన్ని ఆపలేరన్నారు. వారి కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే విధుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. అర్హులైన వారి ఒక్క ఓటును తొలగించినా సహించేది లేదని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు దాడి చేయడం అత్యంత దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడితో సమానమని ఆనంద్‌రావు పటేల్ అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముజ్జిగే ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ దాసరి మధు, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మగ్గిడి దిగంబర్, మహేందర్, డి. వెంకటేష్, హైమద్ పాషా, రాధాకృష్ణ, ఆనంద్, ముత్యం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
