రాష్ట్రస్థాయి వ్యాసరచనలో కృష్ణపట్నం విద్యార్థుల ప్రతిభ

తృతీయ స్థానం.. రూ.27 వేల నగదు బహుమతి

ముత్తుకూరు, ఆంధ్రప్రభ : అంతర్జాలం రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో కృష్ణపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 8, 9వ తరగతి విద్యార్థులు కరణం సిద్ధార్థ, కర్పూరపు జ్యోతిర్మయిరెడ్డి, బంకి కిషోర్‌ తృతీయ స్థానం సాధించి రూ.27 వేల నగదు బహుమతి పొందారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ మోహన్‌కందా స్థాపించిన వారధి ఇండియా ఫౌండేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ భాగస్వామ్యంతో ఈ పోటీలు నిర్వహించారు. ‘ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి నాణ్యమైన విద్య పునాది’ అనే అంశంపై తొలుత జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి, అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

కృష్ణపట్నం హైస్కూల్‌ విద్యార్థులు సాధించిన ఘన విజయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరళ శనివారం తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీ, గైడ్‌ టీచర్‌ ఆర్‌. విజయ్‌కుమార్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.