గడువులోగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి
సీఈఓ వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న విచారణలను, ఇతర ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు.
గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణాజిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి పాల్గొని జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి 16.49 శాతం విచారణలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గన్నవరం ప్రాంతంలో 24 శాతం విచారణలు పెండింగ్‌లో ఉండగా, వాటిని వేగవంతం చేసేందుకు అదనంగా ఏఆర్‌ఓలను నియమించినట్లు చెప్పారు. గన్నవరం మినహా మిగిలిన ప్రాంతాల్లో విచారణ ప్రక్రియను సెప్టెంబర్ 10 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గన్నవరం ప్రాంతానికి మాత్రం మరో ఐదు రోజుల అదనపు సమయం అవసరమవుతుందని వివరించారు.
ఫారమ్‌లకు సంబంధించి ఫారమ్-8 వరకు ప్రక్రియను ప్రస్తుతం డ్రై రన్ తరహాలో నిర్వహిస్తున్నామని, జిల్లాలో అధిక సంఖ్యలో ఫారమ్‌లను ప్రాసెస్ చేస్తున్నందున వాటి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. ఫారమ్-6, ఫారమ్-7 ప్రక్రియలు కూడా సజావుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో మిగిలిన అన్ని పనులను సెప్టెంబర్ 15 నాటికి దాదాపుగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి కే శ్రీధర్ రెడ్డి, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
