మోదీతో క్రాఫ్టన్‌ చైర్మన్‌ భేటీ

  • భారత్‌లో మరో రూ.250 కోట్ల పెట్టుబడులకు సిద్ధం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గేమింగ్‌, సాంకేతిక, డిజిటల్‌ వినోద రంగాల్లో భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని క్రాఫ్టన్‌ సంస్థ చైర్మన్‌ బైంగ్‌ గ్యూ చాంగ్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. భారత్‌-దక్షిణ కొరియా మధ్య సాంకేతిక, గేమింగ్‌, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సంస్థ వెల్లడించింది.

భారత్‌ను గేమింగ్‌, ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలపై చర్చించారు. ప్రధానమంత్రి ‘వికసిత్‌ భారత్‌’, ‘భారత్‌లో సృష్టించు.. భారత్‌ కోసం సృష్టించు.. ప్రపంచం కోసం సృష్టించు’ లక్ష్యాలకు అనుగుణంగా భారతీయ ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచస్థాయి ఆటలు, డిజిటల్‌ అనుభవాలను అభివృద్ధి చేయవచ్చని క్రాఫ్టన్‌ పేర్కొంది.

ఇప్పటివరకు భారత్‌లో 250 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు క్రాఫ్టన్‌ తెలిపింది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో మరో 250 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించింది. దీంతో భారత్‌లో సంస్థ మొత్తం పెట్టుబడులు సుమారు 500 మిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి. భారత్‌లో పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు 670 మిలియన్‌ డాలర్ల వెంచర్‌ గ్రోత్‌ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

గేమింగ్‌ రంగంతో పాటు కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, డీప్‌టెక్‌ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై కూడా సంస్థ దృష్టి సారించనుంది. భారతీయ గేమింగ్‌ సంస్థలు, స్థానికంగా అభివృద్ధి చెందుతున్న మేధో సంపత్తి, స్టార్టప్‌లకు పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా మద్దతు ఇవ్వనున్నట్లు క్రాఫ్టన్‌ తెలిపింది.

భారత్‌లో గేమింగ్‌, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని క్రాఫ్టన్‌ చైర్మన్‌ బైంగ్‌ గ్యూ చాంగ్‌ అన్నారు. భారతీయ ప్రతిభపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించడం ద్వారా భారతీయ సృష్టికర్తలు, అభివృద్ధిదారులు, పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

యువ ప్రతిభకు నైపుణ్యాలను అందించేందుకు క్రాఫ్టన్‌ ఇటీవల కేజీఐ అకాడమీని ప్రారంభించింది. గేమ్‌ అభివృద్ధి, డిజిటల్‌ సృష్టి రంగాల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పెంపొందించడమే దీని లక్ష్యం. పుణేకు చెందిన ‘రియల్‌ క్రికెట్‌’ గేమ్‌ అభివృద్ధి చేసిన నాటిలస్‌ మొబైల్‌ సంస్థను సైతం క్రాఫ్టన్‌ కొనుగోలు చేసింది. దీంతో స్థానిక గేమింగ్‌ ప్రతిభ, భారతీయంగా అభివృద్ధి చేసే గేమింగ్‌ మేధో సంపత్తికి మరింత ప్రోత్సాహం లభించనుంది.

క్రాఫ్టన్‌ భారత్‌లో నిర్వహిస్తున్న ప్రధాన గేమింగ్‌ ఉత్పత్తుల్లో బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా కీలకమైనది. ఈ గేమ్‌ 260 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్లను అధిగమించినట్లు సంస్థ తెలిపింది. గేమింగ్‌, ఈ-స్పోర్ట్స్‌, ఇంటరాక్టివ్‌ వినోదం, సాంకేతిక రంగాల్లోని భారతీయ స్టార్టప్‌లలో 2021 నుంచి 250 మిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది.