భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు
కలెక్టర్ పుండ్కర్
కోటబొమ్మాళి(శ్రీకాకుళ), ఆంధ్రప్రభ : కొత్తమ్మ తల్లి శతాబ్ద ఉత్సవాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొనేలా పక్కా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ (Collector Swapnil Dinakar Pundkar) అన్నారు. సోమవారం కోటబొమ్మాళిలోని వంశధార హై స్కూల్ (Vamsadhara High School) మైదానంలో భక్తులు, పర్యాటకులకు కొత్త అనుభూతిని కల్పించే విధంగా ఉత్సవాల్లో తొలిసారి ఆకర్షణగా నిలిచే హెలికాప్టర్ రైడ్‌ను కలెక్టర్ పరిశీలించారు. పరిసర ప్రాంతాలను తిరిగి అధికారులకు సూచనలను జారీ చేశారు. వంశధార హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ టికెట్ల కౌంటర్ ను పరిశీలించారు. పరిసరాలలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
హెలికాప్టర్ రైడ్ కు వచ్చే పర్యాటకులు కూర్చునేదుకు వీలుగా పెండాల్ ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఫైర్ సేఫ్టీ (Fire Safety), వైద్య శిబిరం (Medical Camp) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల వాహనాల పార్కింగ్, తాగునీటి సదుపాయం, రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అనంతరం క్యూ లైన్లలో తిరిగి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ (District Water Management Company) పథక సంచాలకులు సుధాకర్, ఆర్ అండ్ బి ఎస్ ఈ సత్యనారాయణ, నెహ్రూ యువ కేంద్ర సహాయ సంచాలకులు వెంకట్ ఉజ్వల్, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య , జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవ రావు, ఆర్డిఓ ఎం. కృష్ణమూర్తి, తాసిల్దార్ ఆర్.అప్పల రాజు, ఎంపీడీవో ఫణీంద్ర కుమార్, డీఎస్పీ లక్ష్మణరావు, రూరల్ సీఐ శ్రీనివాసరావు, కొత్తమ్మ తల్లి ఆలయ ఈ వో రాధా కృష్ణ, తదితరులు, పాల్గొన్నారు.

