ఖతార్‌ రాయబారిగా కొప్పుల శ్రీకర్‌రెడ్డి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నియామక పత్రం స్వీకరణ

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన కొప్పుల శ్రీకర్‌రెడ్డి ఖతార్‌ రాయబారిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు.

కొప్పుల శ్రీకర్‌రెడ్డి గతంలో పాస్‌పోర్టు అధికారిగా, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. విదేశీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఆయనకు ప్రస్తుతం ఖతార్‌ రాయబారిగా కీలక బాధ్యతలు అప్పగించారు.

శ్రీకర్‌రెడ్డి ఖతార్‌ రాయబారిగా నియమితులు కావడంపై కొండగడప గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. గ్రామానికి చెందిన వ్యక్తి కీలక బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని పేర్కొన్నారు.