మట్టి వినాయకుని పూజిద్దాం..

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ఉల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

కోడూరు, ఆంధ్రప్రభ : మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని కోడూరు ఎస్సై కే. చాణిక్య అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం కోడూరు గ్రామానికి చెందిన ఉల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్సై చాణిక్య హాజరై భక్తులకు విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి విగ్రహాలను వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించేందుకు ముందుకు రావాలని సూచించారు.

గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి వినాయక చవితి సందర్భంగా ఉల్లి వెంకటేశ్వరరావు భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని ఎస్సై చాణిక్య ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు యద్దనపూడి గోపాలకృష్ణ, ముద్దినేని చందర్రావు, యార్లగడ్డ ఓంకార్‌, ఉల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.