రేవంత్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు

  • ‘నన్ను రాజకీయంగా అణచివేశారు’
  • ‘నా శాఖల్లో నా అధికారాలు తగ్గించారు’
  • ‘సీఎంవో నుంచే నేరుగా ఆదేశాలు’
  • ‘నాకు తెలియకుండానే కీలక నిర్ణయాలు’
  • ‘మంత్రి హోదాను అవమానించారు’
  • ‘నా నియోజకవర్గానికి నిధుల్లో వివక్ష’
  • ‘నా కుటుంబంపై రాజకీయ దాడులు’
  • కాంగ్రెస్‌ అగ్రనేతలకు సురేఖ పది పేజీల లేఖ
  • ఆధారాలతో పెన్‌డ్రైవ్‌ జత చేసిన సురేఖ
  • 22న ఆరోపణలు.. 28న రేవంత్‌కు రాఖీ
  • ఆరోపణల నుంచి రాఖీ వరకు.. ఇదేం ట్విస్ట్‌!

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను మొదటి నుంచే రాజకీయంగా, పరిపాలనాపరంగా అణచివేస్తున్నారని ఆరోపిస్తూ కొండా సురేఖ కాంగ్రెస్‌ అగ్రనేతలకు రాసిన పది పేజీల లేఖను కొండా సురేఖ విడుద‌ల చేసింది. ఆగస్టు 22న తేదీతో ఉన్న ఈ లేఖను సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, ప్రియాంకాగాంధీ, మీనాక్షి నటరాజన్‌లకు పంపినట్లు సమాచారం. తన శాఖల్లో కీలక నిర్ణయాలు తనకు తెలియకుండానే తీసుకున్నారని, తన మంత్రి పదవి ఉన్నప్పటికీ నిర్ణయాధికారం క్రమంగా తగ్గించారని ఆమె ఆరోపించారు.

మంత్రిగా తన అధికారాలను సీఎంవో జోక్యంతో పరిమితం చేశారని సురేఖ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన శాఖలకు సంబంధించిన విషయాల్లో అధికారులకు సీఎంవో నుంచి నేరుగా ఆదేశాలు వెళ్లేవని, దీంతో మంత్రిగా తన పాత్ర నామమాత్రంగా మారిందని ఆమె ఆరోపించారు. యాదాద్రి దేవస్థానం ట్రస్టు బోర్డు ఏర్పాటు విషయంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, సమ్మక్క–సారలమ్మ దేవాలయాల శాశ్వత అభివృద్ధికి ఉద్దేశించిన నిధులను తనకు తెలియకుండానే ఒక్క రోజులోనే రహదారులు, భవనాల శాఖకు బదిలీ చేశారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ తనపై కొనసాగుతున్న రాజకీయ, పరిపాలనా ఒత్తిడికి ఉదాహరణలుగా ఆమె వివరించినట్లు సమాచారం.

తన మాజీ ప్రత్యేక విధుల అధికారి సుమంత్‌ విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు తనను అవమానించిందని సురేఖ ఆరోపించారు. తనకు తెలియకుండానే సుమంత్‌ను పదవి నుంచి తొలగించారని, అనంతరం అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తన ఇంటికి రావడం ద్వారా మంత్రి హోదాను అవమానించారని ఆమె లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సుమంత్‌ వ్యవహారంపై గతంలోనూ కొండా కుటుంబం, పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించే విషయంలోనూ వివక్ష చూపించారని సురేఖ ఆరోపించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కాంగ్రెస్‌ నేతలను తనకు వ్యతిరేకంగా పనిచేసేలా రేవంత్‌రెడ్డి ప్రోత్సహించారని ఆమె ఆరోపించినట్లు సమాచారం. అంతేకాకుండా దేవాదాయ శాఖపై తనకు సమాచారం ఇవ్వకుండా అప్పటి మంత్రి కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారని, దీనిపై తాను ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్‌ నోటీసు ఇవ్వడంపైనా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుస్మిత వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటితో తనకు సంబంధం లేదని ఆమె ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. ఇతరులు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో చర్యలు తీసుకోకుండా తనను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని సురేఖ ఆరోపించారు. తాను బీసీ మహిళా మంత్రిని కావడం వల్లే తనపై ఈ విధమైన చర్యలు, రాజకీయ కుట్ర జరుగుతున్నాయని ఆమె లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

తన కుటుంబంపై జరుగుతున్న పరిణామాలన్నీ రాజకీయ దాడుల్లో భాగమేనని సురేఖ ఆరోపించారు. లేఖలో ప్రస్తావించిన వాటికంటే చెప్పని ఘటనలు ఇంకా అనేకం ఉన్నాయని పేర్కొంటూ, తన ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను పెన్‌డ్రైవ్‌లో జత చేస్తున్నట్లు కాంగ్రెస్‌ అగ్రనేతలకు తెలిపినట్లు వెల్లడైంది. ఈ లేఖ వెలుగులోకి రావడం, అదే సమయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలపై నిర్ణయం తీసుకోవడం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చకు తెరతీసింది.

అయితే ఈ ఆరోపణలకు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలకు మధ్య ఆసక్తికరమైన రాజకీయ వైరుధ్యం కనిపిస్తోంది. ఆగస్టు 22న రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలతో కాంగ్రెస్‌ అగ్రనేతలకు లేఖ రాసిన కొండా సురేఖ, ఆగస్టు 28న రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. పార్టీ అంతర్గత వివాదం, క్రమశిక్షణ చర్యలపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాఖీ సందర్భంగా ఇద్దరి మధ్య సయోధ్య సంకేతాలు కనిపించాయని అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

ఇక ఈ పరిణామాల అనంతరం సెప్టెంబర్‌ 3న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించిన వివాదం, ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు తదితర పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగస్టు 22న సురేఖ రాసిన లేఖలోని ఆరోపణలు ఇప్పుడు మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి