కొండా సురేఖ ఫేస్ బుక్‌లో కీలక పోస్ట్
త్వరలో కీలక నిర్ణయం ప్రకటిస్తానంటూ మాజీ మంత్రి సంచలన సంకేతాలు
సామాజిక మాధ్యమంలో సురేఖ పోస్ట్..
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామానికి తెరలేచింది. మాజీ మంత్రి కొండా సురేఖ సామాజిక మాధ్యమ వేదికగా చేసిన తాజా పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. “నిరీక్షణ దాదాపు ముగిసింది.. త్వరలో కీలక ప్రకటన రాబోతోంది” అనే అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు? ఎలాంటి రాజకీయ అడుగు వేయబోతున్నారు? అన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.

“ది వెయిట్ ఈజ్ ఆల్‌మోస్ట్ ఓవర్.. ఏ బిగ్ అప్‌డేట్ ఈజ్ కమింగ్ సూన్.. స్టే ట్యూన్డ్ తెలంగాణ” అంటూ కొండా సురేఖ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆమె చేయబోయే ప్రకటన ఏమిటన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో ఆమె పోస్ట్ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చలు మొదలయ్యాయి.
ఇటీవల కొండా సురేఖకు సంబంధించిన రాజకీయ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేతలకు ఆమె లేఖలు రాయడం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తాజా ప్రకటనపై ఉత్కంఠ మరింత పెరిగింది.
కొండా సురేఖ తన తాజా పోస్ట్‌లో నిర్ణయం స్వరూపాన్ని వెల్లడించకుండా కేవలం “త్వరలో” అంటూ సంకేతాలు ఇవ్వడం గమనార్హం. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా కీలక ప్రకటన చేస్తారా? పార్టీ వ్యవహారాలపై స్పందిస్తారా? లేక తన తదుపరి రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తారా? అనే చర్చ సాగుతోంది. అయితే అధికారికంగా ఆమె నుంచి స్పష్టత వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది.
మరోవైపు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సురేఖ తాజా ప్రకటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఆమె ప్రకటన కోసం అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. “నిరీక్షణ ముగిసింది” అంటూ ఆమె చేసిన సంకేతాలతో త్వరలోనే కీలక ప్రకటన ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ ప్రకటన ఏంటి? అన్నది మాత్రం ఆమె స్వయంగా వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే.
