ఫేస్బుక్ పోస్టుపై కొండా సురేఖ క్లారిటీ!
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి కొండా సురేఖ పేరుతో వివిధ సామాజిక మాధ్యమ వేదికల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె కార్యాలయం స్పష్టత ఇచ్చింది. తన పేరుతో వైరల్ అవుతున్న వార్తలు, పోస్టులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొండా సురేఖకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే విషయంలో సామాజిక మాధ్యమాల్లోని అనధికారిక ఖాతాలు, వ్యక్తిగత పోస్టులను ప్రామాణికంగా తీసుకోవద్దని సూచించింది.

ఈ రోజు కొండా సురేఖ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్గా మారింది. ‘నిరీక్షణ ముగిసింది.. త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటిస్తా.. బిగ్ అప్డేట్ కమింగ్ సూన్’ అంటూ ఆమె ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో కొండా సురేఖ తదుపరి రాజకీయ అడుగు ఏమిటన్న దానిపై తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ పోస్టు రాజకీయంగా మరింత ఆసక్తిని రేకెత్తించింది.
అయితే, తన పేరుతో ప్రచారంలో ఉన్న పోస్టులు, వార్తల విషయంలో కొండా సురేఖ తాజాగా వివరణ ఇచ్చారు. వివిధ సామాజిక మాధ్యమ వేదికల్లో తన పేరుతో ప్రచారమవుతున్న వార్తలు, పోస్టులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని కేవలం అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల నుంచే తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు తమ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను కూడా మీడియా ప్రతినిధులకు, ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కొండా సురేఖకు సంబంధించిన ప్రకటనలు, రాజకీయ నిర్ణయాలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అధికారిక ఖాతాల్లో వెలువడే వివరాల ఆధారంగానే పరిగణించాలని సూచించారు.
కొండా సురేఖ పేరుతో వైరల్ అయిన ‘కీలక నిర్ణయం’ పోస్టుపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె తదుపరి రాజకీయ కార్యాచరణపై ఆసక్తి నెలకొన్న సమయంలోనే ఈ వివరణ రావడంతో ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రచారానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, ఆమె తదుపరి నిర్ణయం ఏమిటన్న దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడాల్సి ఉంది.
అధికారిక ఖాతాల నుంచే సమాచారం
కొండా సురేఖ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టు కనిపించినా, అది అధికారిక ఖాతాకు చెందినదేనా అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే వార్తగా పరిగణించాలని ఆమె కార్యాలయం కోరింది. మీడియా ప్రతినిధులు, ప్రజలు అనధికారిక ఖాతాలు, ధృవీకరణ లేని పోస్టుల ఆధారంగా నిర్ణయాలకు రావద్దని విజ్ఞప్తి చేసింది. దీంతో ‘కీలక నిర్ణయం’పై జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి స్పష్టత రానప్పటికీ.. సురేఖ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్న దానిపై ఆసక్తి కొనసాగుతోంది.
